2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఇక కదన రంగంలోకి దూకనున్నట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయమే ధ్యేయంగా ఆయన దేశ వ్యాప్త సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో తాము సీట్లు కోల్పోయిన.. లేదా బీజేపీ బలహీనంగా ఉన్న 144 లోక్ సభ సీట్లలో జరిగే దాదాపు 40 ర్యాలీల్లో మోడీ పాల్గొనవచ్చునని అంటున్నారు.
మిగిలిన 104 స్థానాల్లో పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ప్రవాస్ యోజన రెండో దశ కింద ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, జిల్లాలు, పట్టణాల్లో బీజేపీకి చెందిన స్థానిక అసంతృప్త నాయకులను బుజ్జగించడం, వారితోను, భావ సారూప్యత కలిగిన నేతలతోను వరుసగా సమావేశాలు నిర్వహించడం వంటివి పార్టీ వ్యూహంలో భాగంగా ఉన్నాయి.
పైగా పార్టీ మంత్రులు అయిదు అంశాల క్యాంపెయిన్ ప్లాన్ అమలు గురించి ప్రజలకు వివరించాలని, ఇందులో పొలిటికల్ మేనేజ్మెంట్ తో బాటు తమకు నిర్దేశించిన క్లస్టర్ కి సంబంధించి తమ లోక్ సభ నియోజకవర్గంలో ఓ రాత్రి ఉండి ప్రజలతో మమేకం కావడంలాంటివి కూడా ఉన్నాయి.
స్థానిక మత నాయకులను, వివిధ వర్గాల నేతలను కలుసుకోవడమే కాకుండా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు వంటి వివిధ వృత్తుల వారితో కూడా ప్రత్యక్షంగా, వర్చ్యువల్ గా మీటింగులు ఏర్పాటు చేయడం ఈ బడా స్ట్రాటిజీలో భాగమని పార్టీ వర్గాలు వివరించాయి. అవసరాన్ని బట్టి మరిన్ని ప్రతిపాదనలను ఈ వ్యూహంలో చేర్చనున్నట్టు తెలుస్తోంది. మంత్రులే కాకుండా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా తగిన బాధ్యతలను అప్పగించే సూచనలున్నాయని తెలుస్తోంది.