‘మన్ కీ బాత్’100వ ఏపిసోడ్ కోసం బీజేపీ భారీ సన్నాహాలు చేస్తోంది. ఈ సారి ఎపిసోడ్‌ను కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేయాలని చూస్తోంది. అందుకు కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో శక్తి వంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని చూస్తున్నట్టు తెలిపాయి. ఇప్పటికే మోడీ పనితీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోందని చెప్పాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోడీ మాటలు వినాయని అనుకుంటున్నారని పేర్కొన్నాయి. అందుకే ఇప్పుడు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే తమ లక్ష్యంగా చెబుతున్నాయి. ‘మన్ కీ బాత్’ సిరీస్‌లో మోడీ ప్రస్తావించిన ప్రతిభావంతులందరినీ గౌరవిస్తామని అంటున్నాయి.
వారితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో వారిని ఆహ్వానిస్తారనీ, అంతగా ప్రచారానికి నోచుకుని ఈ ప్రముఖులందర్నీ దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఆహ్వానిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి. పలు విశేషాలతో 100వ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నట్టు వివరించాయి.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని అందులో 100 ప్రాంతాల్లో 100 మంది చొప్పున కూర్చుని మన్‌కీ బాత్ వినేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ను ఏప్రిల్ 30న ప్రసారం కానుంది. లక్షకు పైగా బూత్ లల్లో దీన్ని టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనప్పటికీ గుర్తింపునకు నోచుకోని వారి సేవలను ‘మన్ కీ బాత్’ ద్వారా వెలుగులోకి తీసుకు వస్తున్నారు.