ఎన్ఈసీ కార్పొరేషన్ చైర్మన్ నోబుహీరో హిండోతో ప్రధాని మోడీ సోమవారం భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో హిండోతో మోడీ సమావేశమయ్యారు.
స్మార్ట్ సిటీలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, డిజిటల్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలపై ప్రధానిమోడీతో హిండో చర్చించినట్టు సమాచారం.
భారత్ లో జపనీస్ భాష నేర్చుకునేలా ప్రోత్సహించే అంశంపై కూడా ఆయన ప్రధాని మోడీతో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై హిండో ప్రశంసలు కురిపించారు.
‘ సామర్థ్యాలను పెంపొందించుకోవాలనే బలమైన లక్ష్యంతో మోడీ ఉన్నారు. స్మార్ట్ సిటీల విషయంలో 5జీ కమ్యూనికేషన్, ప్లాట్ ఫారమ్ లను మేము అందించగలము. ఆయా రంగాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలిగే సమాధానాలు మా దగ్గర ఉన్నాయి’ అని ఆయన అన్నారు.
భారత కమ్యూనికేషన్ సెక్టార్ లో ఎన్ఈసీ పాత్రను ప్రధాని మోడీ అభినందించారు. ప్రత్యేకంగా చెన్నై నుంచి అండమాన్ నికోబార్, కొచ్చి నుంచి లక్షద్వీప్ దీవుల వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు విషయంలో ఆ కంపెనీ పనితీరు అమోఘమని కొనియాడారు.