ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి హీరాబెన్ కు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో హుటాహుటిన అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ లో చేర్పించారు.
అక్కడ హీరాబెన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
తల్లి అనారోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని మోడీ హుటాహుటిన బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు. అయితే ఈ ఏడాది జూన్ 13న హీరాబెన్ మోడీ శత వసంతంలోకి అడుగుపెట్టారు.
కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ ని గాంధీనగర్ లోని ఆమె నివాసంలో కలిశారు. ఆ సమయంలో ప్రధాని మోడీ తన తల్లి పక్కన కూర్చొని కాసేపు మాట్లాడారు. అనంతరం తన తల్లి పాదాలను తాకి ఆశీస్సులు మోడీ తీసుకున్నారు.