అండమాన్, నికోబార్ లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ పేర్లు పెట్టారు. పరాక్రమ్ దివస్ సందర్భంగా సోమవారం ఆయన వీటికి పేర్లను నిర్ణయించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 23 వ తేదీని ‘పరాక్రమ్ దివస్’ గా పాటించాలని 2021 లో ప్రభుత్వం ప్రకటించింది. నేతాజీ ద్వీపంలో నిర్మించబోయే నేషనల్ మెమోరియల్ మోడల్ ను మోడీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో అండమాన్, నికోబార్ దీవుల్లోని 21 దీవులకు ఆయన 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టడం విశేషం.
మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్, లాన్స్ నాయక్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రాణే, నాయక్ జాదూనాథ్ సింగ్, హవల్దార్ పీరూ సింగ్, కెప్టెన్ జీ.ఎస్. సలేరియా, లెఫ్టినెంట్ కల్నల్ ధాన్ సింగ్ థాపా, సుబేదార్ జోగీందర్ సింగ్, మేజర్ శైతాన్ సింగ్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జొరీ తారాపోర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ క్షేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ శేఖాన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయిబ్ సుబేదార్ బానాసింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ పేర్లను ఈ దీవులకు నిర్ణయించారు.
నేతాజీ 126 వ జయంతిని పురస్కరించుకుని ఈ త్యాగవీరుల పేర్లను వీటికి పెట్టినట్టు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. దేశానికి వీరు చేసిన సేవలు నిరుపమానమని తెలిపింది.
అండమాన్, నికోబార్ దీవుల చరిత్రాత్మక ప్రాధాన్యాన్ని దృష్టిలోనుంచుకుని నేతాజీ స్మృతికి గౌరవ సూచకంగా రాస్ దీవుల పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంగా మోడీ మార్చారు. 2018 లో ఆయన ఈ ద్వీపాన్ని సందర్శించారు.