కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే 25 ఏళ్ల కార్యాచరణను సిద్ధం చేస్తోంది కేంద్రం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ… పీఎం గతిశక్తి ప్రణాళికను వివరించారు.
వచ్చే 25 ఏళ్లు.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేవి ప్రజలకు రణ నినాదం కావాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. రాబోయే రోజుల్లో పీఎం గతిశక్తి ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది రూ.100 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ అని.. ఆర్థిక వ్యవస్థకు సమగ్రమైన బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
యువతకు ఉపాధి అవకాశాలతోపాటు సంపూర్ణ మౌలిక సదుపాయాల వృద్ధికి పీఎం గతిశక్తి ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు ప్రధాని. ఏడేళ్ల క్రితం భారత్ 8 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేదని.. ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల ఫోన్లను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని గుర్తు చేశారు.
అత్యాధునిక ఆవిష్కరణలు, కొత్త తరం టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీ కోసం భారతీయులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని. ఈ గతి శక్తి.. స్థానిక తయారీదారులకు ప్రపంచంతో పోటీ పడేందుకు సహాయం చేస్తుందని చెప్పారు.