వాడేసిన వస్తువులను అమ్మేసే ఓఎల్ఎక్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఫేక్ ప్రకటనలతో విమర్శలెదురుకుంటున్న ఓఎల్ఎక్స్ లో ఏకంగా ప్రధాని కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టేశారు. వారణాసిలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ప్రధాని నరేంద్రమోడీ వారణాసి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధాని కార్యాలయాన్ని అమ్ముతున్నట్లు ఓఎల్ఎక్స్ లో ప్రకటన వచ్చింది. మోడీ కార్యాలయాన్ని 7.5కోట్లకు అమ్మాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఫిర్యాదుపై రియాక్ట్ అయిన పోలీసులు, యాడ్ తీసేయించటంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.