తెలంగాణలో అధికారం కోసం పోరాడుతున్న నేతల్లో వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఒకరు. ఆమె పాదయాత్రను అడ్డుకోవడం.. దాడులు జరగడం.. అరెస్ట్ లు ఇలా ఈమధ్య షర్మిల పేరు మార్మోగుతోంది. ప్రగతి భవన్ ముట్టడి ఇష్యూ వైటీపీకి బాగా హైప్ తీసుకొచ్చింది. జాతీయ మీడియాలో సైతం షర్మిల యాత్రపై వార్తలు వచ్చాయి. ఆమె అరెస్ట్ ను ఇతర పార్టీల నేతలు ఖండించారు. ఇప్పుడు ఆ లిస్టులో చేరిపోయారు ప్రధాని మోడీ.
షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిణామాలపై ఆమెతో చర్చించారట. దాదాపు 10 నిమిషాల పాటు వీరి ఫోన్ సంభాషణ కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిలను ఢిల్లీకి రావాలని మోడీ సూచించినట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకు సానుభూతి వ్యక్తం చేసిన మోడీ… ఒక మహిళ అని కూడా చూడకుండా కారులో ఉండగానే స్టేషన్ కు తీసుకెళ్లడంపై మండిపడ్డారట.
సోమవారం జరిగిన జీ-20 ఆల్ పార్టీ మీటింగ్ సమావేశంలోనూ మోడీ.. ఏపీ సీఎం జగన్ దగ్గర షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈక్రమంలోనే షర్మిలకు ఆయన ఫోన్ చేశారని అంటున్నారు.
షర్మిలపై దాడి.. అరెస్ట్ ను ఆమధ్య బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు ఖండించారు. అయితే.. ఆమె వెనుక బీజేపీ ఉందని అంటోంది టీఆర్ఎస్. ఇప్పుడు మోడీ ఫోన్ చేశారన్న వార్త బయటకు రావడంతో మరోసారి దీనిపై రచ్చ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.