రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో గవర్నర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి రాజ్ భవన్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలుసుకున్నారు. పర్యటనకు ముందు పశ్చిమ బెంగాల్ వెళ్తున్నందుకు ”ఆతృతగా” ఉంది….అదే సమయంలో రామకృష్ణ మఠంలో గడపనున్నందుకు ”ఆనందంగా” ఉందంటూ సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. స్వామి వివేకానంద జయంతిని రామకృష్ణ మఠంలో జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఆ స్థలం ఎంతో ప్రత్యేకమైనది…ఎందుకంటే ”జన సేవనే ప్రభు సేవ” అనే సిద్దాంతాన్ని తనకు బోధించిన స్వామి ఆత్మస్థానంద అక్కడ లేకపోయినప్పటికీ అది ప్రత్యేక స్థలమన్నారు.
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు సార్లు ఒకే వేదికపై కలుసుకోనున్నారు.రెండు రోజుల్లో ప్రధాన మంత్రి తన ప్రారంభోత్సవాలు, ఉత్సవాలతో బిజీగా గడపనున్నారు. మమతా బెనర్జీ రెండు కార్యక్రమాలకు ప్రధాన మంత్రిని ఆహ్వానించింది. రాజ్ భవన్ లో ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు.
ప్రధాన మంత్రి పర్యటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో పెద్ద ఎత్తున భద్రత దళాలను మోహరించారు.