– త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ హవా
– మేఘాలయలో మాత్రం వెనుకే!
– సత్తాచాటిన సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ
– కాంగ్రెస్ మరోసారి వైఫల్యం
– మూడు రాష్ట్రాల ప్రజలకు పీఎం ధన్యవాదాలు
– దేశానికి కొత్త రాజకీయ సంస్కృతిని..
– అందించామని విజయ ప్రసంగం
– గత ప్రభుత్వాలు కష్టం నుంచి పారిపోయేవి..
– మేము సవాళ్లను వెంబడించామన్న మోడీ
మూడు ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో తిరిగి అధికార పగ్గాలను చేబట్టనుండగా మేఘాలయాలో మాత్రం సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సత్తా చాటింది. త్రిపురలో బీజేపీ కూటమి 33 చోట్ల గెలుపొందగా.. నాగాలాండ్ లోనూ మేజిక్ ఫిగర్ మార్క్‌ను దాటింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి.
త్రిపురలో తిప్రా మోత పార్టీ నుంచి బీజేపీ కూటమికి గట్టి పోటీ ఎదురైంది. ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీ ఏకంగా 12 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. ఈశాన్యంలో కాషాయం రెపరెపలాడడంతో దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు చేసుకుంది.
ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న పని.. నైతికత, కార్యకర్తలకు సహాయపడే స్వభావం.. ఈ మూడు అంశాల సమ్మేళనంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.
దేశానికి కొత్త రాజకీయ సంస్కృతిని అందించామని చెప్పారు. మునుపటి ప్రభుత్వాలు కష్టమైన పనుల నుండి పారిపోయేవని.. కానీ, తాము సవాళ్లను వెంబడించామని అన్నారు ప్రధాని మోడీ. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రాల ప్రగతికి కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ ఫలితాల్ని అందించినందుకు పార్టీ కార్యకర్తలను తాను అభినందిస్తున్నానని చెప్పారు మోడీ.