దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ బుధవారం అత్యున్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. గత కొన్ని వారాలుగా ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర ఆరోగ్య మంతిత్వ శాఖ వాటిని హెచ్చరించింది. కేసులు పెరుగుతున్న కొత్త క్లస్టర్లను గుర్తించాలని సూచించింది. తాజాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1134 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 7,026 కి చేరుకున్నాయి.
5 గురు కోవిడ్ రోగులు మరణించారు. ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ మరణాలు సంభవించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.09 శాతం కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.98 శాతం ఉన్నట్టు వివరించింది.
నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 83 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఈ నగరంలో కరోనా తో బాటు హెచ్ 3ఎన్ 2 ఇన్ ఫ్లుఎంజా కేసులు కూడా పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరుగుతోంది.ఇక మహారాష్ట్రలో కొత్తగా 280 కరోనా కేసులు నమోదైనట్టు సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత గురువారం ఆరోగ్య శాఖ.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు కూడా లేఖలు రాస్తూ ..కోవిడ్ కేసుల అదుపుపై దృష్టి సారించాలని కోరింది. కరోనా కేసులతో బాటు ఇన్ ఫ్లుయెంజా కేసుల పెరుగుదల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో ఇందుకు అవసరమైన మందులనన్నింటినీ అందుబాటులో ఉంచాలన్నారు. గతంలో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.