ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గాంధీనగర్ లోని సెక్టార్ 30 ప్రాంతంలో గల స్మశాన వాటికలో ఆమె చితికి మోడీ, ఇతర కుటుంబ సభ్యులు నిప్పంటించారు. ఈ సమయంలో మోడీ సోదరులు సోమాభాయ్, పంకజ్ మోడీ ఆయన వెంటే ఉన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఇతర ఉన్నతాధికారులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.
అంతకు ముందు తన మాతృమూర్తి పాడెను మోడీ మోశారు. అంతిమ యాత్ర వాహనం లోను తల్లి భౌతిక కాయం వద్దే కూర్చుని ఆమెతో తన స్మృతులను తలచుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. హీరాబెన్ మృతి సమాచారం తెలుసుకున్న అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
గుజరాత్ ఎప్పుడు వచ్చినా మోడీ తన తల్లి ఆశీర్వాదాలు తీసుకునేవారు.. 2015 లో అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ.. తల్లి హీరాబెన్ ను తలచుకుని కన్నీటి పర్యంతమైన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు కొందరు.
తన చిన్నతనంలో హీరాబెన్ ఎన్నో కష్టాలు పడిందని, .పాత్రలు కడుగుతూ.. నీళ్లను మోస్తూ ఆమె తన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిందని ఆయన నాడు గుర్తు చేసుకున్నారు.’ ఆమె ఒక నిస్వార్థ కర్మయోగి.. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని భగవంతుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సు లాంటిది.. ఆమెలో త్రిమూర్తులను చూశాను.. విలువలకు ఆమె నిలువెత్తు నిదర్శనం’అని మోడీ ట్వీట్ చేశారు.