ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. తన వంద ఏళ్ళ వయస్సులో అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో ఆమె కన్ను మూశారు. రెండు రోజుల క్రితమే అనారోగ్యంతో ఆమె హాస్పిటల్ లో చేరారు. ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని, ఇక డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో హీరాబెన్ మృతి చెందారు.
తల్లి మృతిపై మోడీ భావోద్వేగంతో ట్వీట్ చేస్తూ.. నిస్వార్థ మూర్తి, కర్మయోగి ఇక లేరని పేర్కొన్నారు. శత వసంతాల మాతృమూర్తి తపస్సులా తన జీవన యానాన్ని కొనసాగించారని, ఆమె నుంచి ఎన్నో విలువలను నేర్చుకున్నానని ఆయన అన్నారు.
‘వంద ఏళ్ళ అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంది.. వందో పుట్టిన రోజున నేను ఆమెను కలుసుకున్నాను.. ఆమె నాతో ఎల్లప్పుడూ ఓ విషయం చెప్పేది.. విజ్ఞతతో పని చేయాలి.. జీవితాన్ని నిస్వార్థంగా .. స్వచ్ఛంగా గడపాలని చెప్పేది’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. మోడీ తరచూ తల్లి హీరాబెన్ గురించి ప్రస్తావిస్తూ ఆమె పట్ల తన అపార గౌరవాన్ని చాటుకుంటూ వచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆమె ఆశీస్సులను ఆయన తీసుకున్నారు.
తల్లి మరణ సమాచారం తెలియగానే మోడీ అహ్మదాబాద్ బయలుదేరారు. అయితే పశ్చిమ బెంగాల్ లో తన షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాలకు ఆయన వర్చ్యువల్ గా హాజరు కావచ్చునని తెలుస్తోంది.