‘కాళీ’ పోస్టర్ ఇటీవల వివాదాస్పదం అవుతోంది. ఈ డాక్యుమెంటరీ పోస్టర్‌లో కాళీమాత వేషధారణలో ఉన్న నటి ఒక చేత్తో త్రిశూలం పట్టుకోగా, మరో చేతిలో సిగరెట్ పట్టుకున్నట్టు ఉంది. దీనిపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. చిత్ర దర్శకురాలు లీలా మణిమేకలపై పలు పోలీస్ స్టేషన్లలో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి.
ఈ క్రమంలో తాజాగా ప్రధాని నోట కాళీమాత ప్రస్తావన వచ్చింది. స్వామి ఆత్మాస్థాన నందా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రామకృష్ణ మఠ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ కు ఎల్లప్పుడు ఆ కాళీ మాత దివ్యాశిస్సులు ఉంటాయని ప్రధాని మోడీ చెప్పుకు వచ్చారు.
స్వామి వివేకానందా గురువులు స్వామి రామకృష్ణ పరమహంస ఓ గొప్ప సన్యాసి అని ఆయన పేర్కొన్నారు. రామకృష్ణకు కాళీ మాత సాక్షాత్కారం జరిగిందని మోడీ అన్నారు. స్వామి వివేకానందకు ఎంతో గుర్తింపు ఉందని, అయినప్పటికీ కాళీ మాత పట్ల భక్తి భావంతో చిన్న పిల్లాడిలా మారిపోయాడని చెప్పారు.
అలాంటి విశ్వాసమే స్వామి ఆత్మస్థానందలోనూ ఉందని ప్రధాని అన్నారు. బెంగాళీ ప్రజలు కూడా కాళీ మాతను భక్తి శ్రద్దలతో ఆరాధిస్తారని చెప్పారు. దీంతో పరోక్షంగా కాళీమాత పట్ల అగౌరవంగా మాట్లాడుతున్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, కాళీ సినిమా దర్శకురాలకి ఆయన పరోక్షంగా చురకలు అంటించారు.