పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరుకాని బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఎంపీల గైర్హాజరును అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంపీలు క్రమశిక్షణను పాటించకపోతే కష్టమని మోదీ వారికి హితవు పలికారు. ముఖ్యంగా సోమవారం నాటి సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి వచ్చినప్పుడు చాలా మంది బీజేపీ ఎంపీలు లేరని ఆయన దృష్టికి రావడంతో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోమవారం ప్రొసిడింగ్స్‌లో రాజ్యసభలో లేని ఎంపీల పేర్లను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు మోదీ.
ఎంపీల గైర్హాజరు, సమయపాలనపై మోదీ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. అయితే సోమవారం కీలక బిల్లులు ఆమోదానికి వచ్చినప్పుడు కూడా రాజ్యసభలో చాలా మంది సభ్యులు కనిపించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇదే విషయంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో క్రమశిక్షణ, గైర్హాజరుపై ఎంపీలకు క్లాస్ తీసుకున్నట్టుగా బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే మంగళవారం, బుధవారం జరిగే పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కావొద్దంటూ బీజేపీ తన సభ్యులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి సోమవారమే ఎంపీలకు మూడు లైన్ల విప్‌ను జారీ చేసింది.