తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
‘తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అందజేయబడుతుంది.’ అని పీఎంవో ట్విట్ చేసింది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి అందజేయబడుతుంది. : ప్రధాని మోదీ
— PMO India (@PMOIndia) May 9, 2022
అలాగే, ఈ దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కామారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద ట్రాలీ ఆటో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 21 మందికి గాయాలయ్యాయి.
ట్రాలీ ఆటోలో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రులకు తరలించారు. ఎల్లారెడ్డిలో సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఒకరు చనిపోగా, సోమవారం మరో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. మృతులు.. సంఘటన స్థలంలో డ్రైవర్ సాయిలు(35), హంసవ్వ, లచ్చవ్వ(77), బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా దేవయ్య, కేశయ్య చనిపోయారు. చికిత్స పొందుతూ అంజవ్వ(35) అనే మహిళ చనిపోయింది.