ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని చెప్పారు ప్రధాని మోడీ. తెలంగాణ పర్యటనలో భాగంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. వసంతపంచమి రోజు ఈ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ ఎంతో కృషి చేస్తుందన్నారు ప్రధాని. వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగం అని తెలిపారు. సాగు విస్తీర్ణం పెంచడంలో ఇక్రిశాట్ ది కీలక పాత్ర అని కొనియాడారు.
దేశంలో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారన్న మోడీ.. చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలతో సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
ఈ సందర్భంగా బడ్జెట్ పై ప్రస్తావించారు ప్రధాని. సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామని.. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నామన్నారు. దేశంలో ప్రాచీన, వైవిధ్యమైన వ్యవసాయ విధానం ఉందని.. పాతికేళ్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు.
అంతకుముందు.. స్వర్ణాత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మోడీ సందర్శించారు. ఇక్రిశాట్ పరిశోధనలు, పురోగతిపై ప్రధానికి శాస్త్రవేత్తలు వివరించారు. ఇక్రిశాట్ లో క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీని, రాపిడ్ జెన్ రీసెర్చ్ ఫెసిలిటీని మోడీ ప్రారంభించారు.