ప్రధాని మోడీ శుక్రవారం ముంబైని సందర్శించి పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపనున్నారు. కేవలం నెల రోజుల్లో మోడీ ముంబైని విజిట్ చేయడం ఇది రెండోసారి. బీర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన ముంబై పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మొదట ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి ముంబై-షోలాపూర్ వందే భారత్ ట్రెయిన్ ను, ఆ తరువాత ముంబై నుంచి అహ్మద్ నగర్ లోని సాయినగర్ షిర్డీని కలిపే రెండో హై స్పీడ్ రైలును ఆయన ప్రారంభించనున్నారు.
ఈ రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపడంతో ముంబై నుంచి నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య మూడుకు, దేశంలో ఈ తరహా రైళ్ల సంఖ్య 10 కి పెరగనున్నాయి. మహారాష్ట్రలో తొలి వందే భారత్ రైలు ముంబైని, గుజరాత్ లోని గాంధీనగర్ ని కలిపింది.
ఇక కురార్-మలాద్, వకోలా-కుర్లా ప్రాంతాల్లో రెండు వెహిక్యులర్ అండర్ పాస్ మార్గాలను కూడా మోడీ ప్రారంభిస్తారు. అంధేరీలో సైఫీ అకాడమీ కొత్త క్యాంపస్ ను ఆయన ప్రారంభిస్తారని, ముంబైలో మొత్తం 38 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
ప్రధానంగా రెండో వందే భారత్ రైలు మహారాష్ట్రలోని నాసిక్ తో బాటు త్య్రంబకేశ్వర్, సాయి నగర్ షిరిడి, శనిసింగపూర్ పుణ్య కేత్రాలను కలుపుతుందని ఈ వర్గాలు వివరించాయి. ప్రధాని మోడీ పర్యటనను పురస్కరించుకుని ముంబైలోని అనేక చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.