ఓవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ జరుగుతుండగా మరోవైపు ప్రధాని మోడీ గురువారం అహమ్మదాబాద్ లో 50 కి.మీ. ‘మెగా రోడ్ షో’ కి శ్రీకారం చుడుతున్నారు. రెండో దశ ఎన్నికలు జరిగే 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ భారీ రోడ్ షో మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు.. మూడు గంటలపాటు సాగవచ్చునని బీజేపీ వర్గాలు తెలిపాయి.
రోడ్ షో సందర్భంగా మోడీ కనీసం 35 చోట్ల అక్కడక్కడా కొద్దిసేపు ఆగి.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించవచ్చునని ఈ వర్గాలు వెల్లడించాయి. నరోడా గామ్ నుంచి ప్రారంభమై.. ఇది గాంధీనగర్ సౌత్ నియోజకవర్గంలో ముగియవచ్చునని భావిస్తున్నారు. మోడీ చేబట్టిన ఈ రోడ్ షో ను ‘పుష్పాంజలి యాత్ర’ గా పార్టీ అభివర్ణించింది.
రాష్ట్ర రెండో దశ ఎన్నికలు ఈ నెల 5 న జరగనున్నాయి. ఇక తొలిదశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
89 సీట్లకు గాను బరిలో 788 మందికి పైగా అభ్యర్థులున్నారు. వీరిలో 70 మంది మహిళలు కూడా పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య ఉంది. ఈ రాష్ట్రంలో తిరిగి అధికార పగ్గాలను చేబట్టేందుకు బీజేపీ తహతహడుతోంది. నరోడా గామ్ నియోజకవర్గాన్ని డెన్మార్క్, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల దౌత్యాధికారులు నిన్న సందర్శించి ఇక్కడ బీజేపీ అభ్యర్థి పాయల్ కులకర్ణి చేసిన ప్రచారాన్ని చూడడం విశేషం.