కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే కర్ణాటకపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ను ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. రాజధాని బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ (ఐఈడబ్ల్యూ)-2023ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.
ఆ తర్వాత తుమకూరులోని హిందుస్థాన్ ఎయిరో నాటికల్ లిమిటెడ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇవ్వనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి ఆయన పర్యటన కొనసాగుతుంది. ఇథనాల్ బ్లెండింగ్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఈ20 ఇంధనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
ప్రజల్లో హరిత ఇంధనాలపై అవగాహన కల్పించేందుకు గాను గ్రీన్ మొబిలిటీ ర్యాలీని ఆయన ప్రారంభిస్తారు. ఇండియన్ ఆయిల్ ‘అన్ బాటిల్’కార్యక్రమం కింద దాదాపు 28 పీఇటి బాటిళ్లను రీసైక్లింగ్ చేసేందుకు వీలుగా యూనిఫారమ్ లను ఆయన ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఇండియన్ ఆయిల్ ఇండోర్ సోలార్ కుకింగ్ సిస్టమ్, ట్విన్-కూక్‌టాప్ మోడల్‌ను జాతికి ప్రధాని అంకితం చేశారు.
సౌర సహాయక శక్తి వనరులపై ఏకకాలంలో పని చేసేలా ఇండోర్ సోలార్ వంట సొల్యూషన్ ను తీర్చిదిద్దారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా తుమకూరులోని హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇవ్వడంతో పాటు తుమకూరు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్, రెండు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.