ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే ను ప్రధాని మోడీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ-దౌస-లాల్ సోట్ ని కలిపే 246 కి.మీ. దూరాన్ని ఇది కలుపుతుంది. దీనివల్ల ఢిల్లీ నుంచి జైపూర్ సిటీకి కేవలం సుమారు రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఇప్పటివరకు ఇందుకు 5 గంటలు పట్టేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దౌస జిల్లాలోని ధనవాడ గ్రామానికి మోడీ హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటారని, దీనికోసం ఆరు హెలిపాడ్ లను ఏర్పాటు చేశామని ఈ వర్గాలు వివరించాయి.
ఈ హైవే విశిష్టతలను వివరిస్తూ .. ప్రతి వాహన రాకపోకలను గమనించేందుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన 360 డిగ్రీ కెమెరాలను ముఖ్యమైన చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నాయి. ఏ కారణం లేకుండా ఏ వాహనమైనా మధ్యలో నిలిచిపోయిన పక్షంలో ఆటోమేటిక్ గా కంట్రోల్ రూమ్ కి సైరన్ సమాచారమిస్తుందని, దాంతో డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటాడని పేర్కొన్నాయి,
ఈ సుదీర్ఘ మార్గం పొడవునా డ్రిప్ ఇరిగేషన్ సదుపాయంతో.. 20 లక్షల చెట్లను కూడా నాటుతున్నారు. ప్రతి 500 మీటర్లకు వర్షాధార హార్వెస్టింగ్ సిస్టం కూడా ఉంటుంది.
ఢిల్లీ-దౌసా లాల్ సోట్ హైవే ను 12,150 కోట్ల వ్యయంతో డెవలప్ చేస్తున్నారు. ఇలాగే ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే అభివృద్ధికి సుమారు 98,000 కోట్లు వ్యయమవుతోంది. ఇది 1386 కి.మీ. మార్గం. ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ దూరం చాలావరకు తగ్గుతుంది. ఢిల్లీతో బాటు హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఇది కలుపనుంది.