భారత్ డ్రోన్ మహోత్సవ్ -2022 కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా డ్రోన్ స్టార్టప్ కంపెనీల, కిసాన్ డ్రోన్ పైలట్లతో ఆయన సంభాషించనున్నారు. డ్రోన్ల ప్రదర్శనను, పనితీరును మోడీ పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు.
భారత్ డ్రోన్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ రంగంలో భారత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో స్టార్టప్ లతో సహా కీలకమైన వాటాదారులను ఒకే చోట చేర్చేందుకు ఈ వేదిక బాగా ఉపయోగపడుతుందన్నారు.
సాంకేతిక రంగం, సృజనాత్మకతలపై ఆసక్తి ఉన్న వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 1600 మందికి పైగా అధికారులు, పలు దేశాల దౌత్యవేత్తలు, సైనిక దళాల సిబ్బంది ఇతర అధికారులు పాల్గొననున్నారు.