నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయరాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విపక్షాలను కూడా ఆహ్వానించామని, కానీ రావడం, రాకపోవడమన్నది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ .. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రధాని మోడీ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈనెల 28 న ఈ భవనాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారని ఆయన చెప్పారు. భవనంలో చారిత్రక ‘రాజదండం సెంగోల్’ ను మోడీ ఆ రోజున ఉంచుతారని. ఈ భవన నిర్మాణం కోసం శ్రమించిన కార్మికులను ఆయన సత్కరిస్తారని అమిత్ షా చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేయాలని కాంగ్రెస్ సహా 19 విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
రాజదండం సెంగోల్ గురించి అమిత్ షా వివరిస్తూ .. ఓ చరిత్రాత్మక ఈవెంట్ పునరావృతమవుతోందని, ఇది తమిళ పదమని, ఇది దేశ సాంస్కృతిక వికాసాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. దేశ చరిత్రలో ఇది అతి ముఖ్యమైన పాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా తమిళ సంప్రదాయానికి సెంగోల్ అద్దం పడుతుందని, చోళ రాజుల కాలం నుంచి ఎప్పటికప్పుడు దీని ప్రాధాన్యం పెరుగుతూ వస్తోందని ఆయన వివరించారు. 1947 ఆగస్టు 14 న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి చేసుకున్నప్పుడు ఈ సెంగోల్ ను స్వీకరించారని గుర్తు చేశారు.
తమిళంలో దీని అర్థం సంపద అని కూడా అమిత్ షా వివరించారు. ఈ ‘రాజదండాన్ని’ కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ సీటు వద్ద ఉంచవచ్చునని తెలుస్తోంది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండానే నూతన భవనాన్ని ప్రారంభించాలని మోడీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని 19 విపక్షాలు నిర్ణయించాయి.
ఇది రాష్ట్రపతి పదవికే అవమానకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఈ పార్టీలు ఆరోపించాయి. ఈ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి గానీ ప్రధాని కాదని పేర్కొన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (ఉద్ధవ్ వర్గం), సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, సీపీఐ, సీపీఎం, కేరళ కాంగ్రెస్ (మణి), ఆర్జేడీ, జేడీ-యు వంటి పార్టీలు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.