భారత పర్యాటక రంగంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి అస్సాం లోని దిబ్రుగఢ్ వరకు సుదీర్ఘంగా .. నాలుగు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే భారీ క్రూజ్ నౌకను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. జనవరి 13 న ఆయన ఈ విశిష్ట నౌకను ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియాలో గంగా-భాగీరథీ-హుగ్ల్లీ-బ్రహ్మపుత్ర సహా 27 నదీమార్గాల గుండాసాగే ఈ అపురూప నౌక మొత్తం 50 రోజులు ప్రయాణిస్తుంది.
ప్రపంచంలోనే ఇది అతి సుదీర్ఘ నౌకా ప్రయాణ ఘట్టం కానుందని, ఇలాంటి ట్రిప్ వాల్డ్ లో మరెక్కడా లేదని మోడీ తెలిపారు. ఇండియాలో క్రూజ్ ఇండస్ట్రీ అద్భుత అభివృద్ధిని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. ఈ క్రూజ్ నౌక 50 టూరిస్ట్ కేంద్రాలను ‘విజిట్’ చేస్తుంది.. వీటిలో వారణాసి గంగా హారతి ప్రదేశం నుంచి కజిరంగ నేషనల్ పార్క్ వంటి వాటితో బాటు సుందర్ బన్స్ డెల్టా వరకు అనేక సురక్షిత కేంద్రాలు ఉన్నాయి’ అన్నారు.
బంగ్లాదేశ్ లో ఈ నౌక 11 వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని, ఓ ప్రైవేట్ సంస్థ దీన్ని నిర్వహిస్తోందని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ గతంలోకన్నా ఇప్పుడు ఎంతో అభివృద్ధి అయిందని, ఈ కారణంగానే ఈ క్రూజ్ సర్వీసును ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు.
నదీ మార్గాల పొడవునా మన నాగరికత పెరుగుతూ వస్తోంది.. నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి.. మన దేశ చరిత్ర గురించి, వారసత్వం గురించి తెలుసుకోవడానికి ఈ విధమైన సర్వీసులు ఎంతో ఉపకరిస్తాయి అని ఆ అధికారి వివరించారు. కోస్తా, రివర్ షిప్పింగ్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. కార్గో ఫ్లోతో బాటు 100 జాతీయ నదీ మార్గాలను ఏర్పరచాలన్నది కేంద్ర లక్ష్యమని ప్రధాని మోడీ ఇటీవల చెప్పారు. ఇదొక బృహత్తర కార్యాచరణ అని ఆయన పేర్కొన్నారు.