లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ముంబైకి రానున్నారు. దివంగత గాయకురాలు లతా మంగేష్కర్ కు నివాళులు అర్పిస్తూ… ఆమె ఎల్లప్పుడూ ధృడమైన, సంపన్నమైన భారతదేశం గురించి కలలు కనేవారని, దేశ నిర్మాణానికి ఆమె కృషి చేశారని ఆయన అన్నారు.
‘ రేపు సాయంత్రం నేను ముంబైలో ఉంటాను. అక్కడ నేను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకుంటాను. లతా దీదీతో సంబంధం ఉన్న ఈ గౌరవాన్ని అందుకుంటున్నందుకు కృతజ్ఞుడిగా ఉన్నాను. ఆమె ఎల్లప్పుడూ శక్తివంతమైన, సంపన్నమైన ఇండియా గురించి కలలు కనేది, దేశ నిర్మాణానికి ఆమె కృషి చేశారు” అని ప్రధాని మోదీ శనివారం తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మన దేశానికి, దాని ప్రజలకు, మన సమాజానికి మార్గనిర్దేశకం చేస్తూ అద్భుతమైన, ఆదర్శప్రాయమైన కృషి చేసిన” వ్యక్తికి ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేయనున్నట్టు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో మరణించారు. ఆమె జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును మొట్టమొదటగా ప్రధాని మోడీకి ట్రస్ట్ ప్రకటించింది.