తెలంగాణ పర్యటనకు వస్తున్నారు ప్రధాని మోడీ. ముచ్చింతల్ లో చినజీయర్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణతోపాటు ఇక్రిశాట్ లో స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.
శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ కు ఎంఐ-17 హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటల వరకు అక్కడ జరిగే స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ఇక్రిశాట్ నూతన లోగోను ప్రధాని ఆవిష్కరిస్తారు.
ఇక్రిశాట్ నుంచి బయలుదేరి ముచ్చింతల్ లోని చిన జీయర్ ఆశ్రమానికి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. అక్కడ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మోడీ పాల్గొంటారు. రాత్రి 8.25 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
ఇటీవల పంజాబ్ లో ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మోడీ వెళ్లే సమయంలో రహదారి మీదుగా ఇతర వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.