ప్రధాని మోడీ నేడు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేరువేరుగా రెండు సమావేశాలు నిర్వహిస్తారు. తొలుత ఉదయం 10 గంటలకు కరోనా కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రెండో దశ విజృంభణ నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో మాట్లాడతారు. ఆ తర్వాత దేశ ప్రజలకు వ్యాక్సినేషన్‌పై మధ్యాహ్నం 12 గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తారు.
వ్యాక్సిన్ ముందుగా ఎవరెవరికి ఇవ్వాలి.. కోట్లాది టీకాలను ఎలా భద్రపరచాలి.. వాటి రవాణ, మారుమూల ప్రాంతాలకు పంపిణీకి ఎలాంటి చర్యలు అవసరం అనే అంశాలపై సీఎంల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకొంటారు. కేంద్రం అందించే సహకారం, ఏర్పాట్లను వారికి వివరిస్తారు. కరోనా రహిత దేశంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలతో దిశానిర్దేశం చేస్తారు.