కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ లకు అత్యవసర అనుమతి ఇచ్చింది ఇండియా. వ్యాక్సినేషన్ కు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కాబోతున్నారు.
ఈ నెల 13 నుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ రవాణా, వ్యాక్సిన్ నిల్వ వంటి అంశాలపై సీఎంలతో ప్రధాని సమావేశం కాబోతున్నారు. ఈ నెల 11న సాయంత్రం 4గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని సీఎంలతో భేటీ అవుతారని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో లాక్ డౌన్ సమయంలో పలుసార్లు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయిన ప్రధాని, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తరుణంలో మరోసారి భేటీ కాబోతున్నారు.