ప్రధాని మోడీ గురువారం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను విజిట్ చేయనున్నారు. దాదాపు 38,800 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా, హస్తినలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వ అధికార పగ్గాలను చేబట్టే ధ్యేయంగా ఆయన సాగనున్నారు. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ ఇప్పటినుంచే తమ పార్టీ విజయాలకు పునాది వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం మోడీ పర్యటనను పురస్కరించుకుని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదట కర్ణాటకను సందర్శించనున్న ఆయన.. కలబుర్గి, యాద్గిర్ జిల్లాలను విజిట్ చేసి ఇరిగేషన్, మంచినీరు, జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను లాంచ్ చేస్తారు. జల్ జీవన్ మిషన్ కింద యాద్గిర్ జిల్లా కోడేకల్ లో 2,050 కోట్ల వ్యయమయ్యే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయనున్నారని, దీనివల్ల సుమారు 2.3 లక్షల ఇళ్లకు మంచినీటి సౌకర్యం కలుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కలబుర్గి, యాద్గిర్, బీజాపూర్ జిల్లాల్లో 4,700 కోట్ల ఖర్చు కాగల వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు చేయనున్నారని పేర్కొంది.
సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగంగా ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని, ఇందుకు 2,100 కోట్లు వ్యయమవుతుందని వివరించింది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఆరు రాష్ట్రాలగుండా సాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడును ఇది కలుపుతుంది. దీనివల్ల ప్రస్తుతమున్న రూట్ 1600 కి.మీ. నుంచి 1270 కి.మీ.కు తగ్గుతుంది. ఇక మహారాష్ట్రలో సైతం మోడీ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.
సాయంత్రం ముంబై చేరుకోనున్న ఆయన.. 12,600 కోట్లు వ్యయమయ్యే ముంబై మెట్రో లైన్లు 2 ఏ, 7 ను ప్రారంభించి దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. 2015 లో ఆయన ఈ లైన్లకు శంకుస్థాపన చేశారు. ముంబై 1 మొబైల్ యాప్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును మోడీ లాంచ్ చేయనున్నారు. ఈ యాప్ వల్ల ప్రయాణం సుఖవంతమవుతుందని, మెట్రో స్టేషన్ల ఎంట్రీ గేట్ల వద్ద వీటిని ప్రజలు చూపవచ్చునని, యూపీఐ ద్వారా టికెట్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చునని తెలిసింది. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ముఖ్యంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అనేక రోడ్డు మార్గాలను మూసివేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.