ప్రధాని మోడీకి ఆహ్వానం విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయి. ముందు మంత్రి తలసాని వెల్ కమ్ చెబుతారని సీఎంవో ప్రకటించింది. లేదు లేదు.. కేసీఆరే వెళ్తారని తర్వాత సమాచారం ఇచ్చింది. తీరా మోడీ ల్యాండ్ అవుతున్న సమయానికి సీఎం వెళ్లడం లేదనే విషయం బయటకొచ్చింది.
కేసీఆర్ కు జ్వరం వచ్చిన కారణంగా ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లలేదట. అయితే.. మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని, సీఎస్, డీజీపీలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత తర్వాత ఇక్రిశాట్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు మోడీ.
ప్రధానికి స్వాగతం విషయంలో శుక్రవారం సాయంత్రం నుంచి అనేక వార్తలు తెరపైకొచ్చాయి. ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలకాలి. కానీ.. మంత్రి తలసాని సీఎం స్థానంలో వెల్ కమ్ చెబుతారని మీడియాకు ఓ నోట్ విడుదలైంది. తర్వాత కేసీఆరే వెళ్తారని హింట్ ఇచ్చారు. కానీ.. సడెన్ గా జ్వరం అంటూ కేసీఆర్ దూరంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలను వినిపిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ పై అసహనం వ్యక్తం చేస్తూ కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై కేంద్రం చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏ మొహం పెట్టుకుని స్వాగతం చెప్పేందుకు వస్తారని ఢిల్లీ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే కేసీఆర్ జ్వరం అంటూ దూరంగా ఉంన్నారని అంచనా వేస్తున్నారు.