ప్రధాని మోడీ గురువారం కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించి 49 వేలకోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట కర్ణాటకలోని యాద్గిర్, కలబుర్గి, విజయ్ పూర్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కలబుర్గి జిల్లా లోని మాల్ఖేడ్ గ్రామంలో వందలాది మంది బంజారాలకు ఆయన ఇళ్ల పట్టాలను ప్రదానం చేశారు. దేశ అభివృద్ధిలో బంజారాలు కీలక పాత్ర వహిస్తున్నారని.. లోగడ 1994 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రచారం కోసం తానిక్కడికి వచ్చినప్పుడు వారు తన నెంతో ఆదరించారని ఆయన చెప్పారు
లక్షలాది బంజారా కుటుంబాలు తనను ఆశీర్వదించడానికి వచ్చిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. కలబుర్గిలో ఒక దశలో మోడీ సంప్రదాయక డ్రమ్స్ వాయించి పార్టీ నేతలను, ప్రజలను ఆశ్చర్యపరిచారు. యాద్గిర్ జిల్లా లోని కోడెకల్ లో ఆరు లేన్ల సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వేకి అయన శంకుస్థాపన చేశారు. 1270 కి.మీ. పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ వే.. ఇండియాలో రెండో అతి పెద్ద జాతీయ రహదారి మార్గం. ఈ సందర్భంగా రెండు గ్రీన్ ఫీల్డ్ సెక్షన్లకు ఆయన పునాది రాయి వేశారు.
ఈ సుదీర్ఘ మార్గం వల్ల మహారాష్ట్ర లోని అక్కల్ కోట్, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 8 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతుంది. . ఈ ఎక్స్ ప్రెస్ వే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. కర్ణాటకలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో మోడీ .. గురువారం ఈ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరిపి పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
నాసిక్, అహ్మద్ నగర్, షోలాపూర్, కలబుర్గి, కర్నూలు, కడప, తిరుపతి వంటి నగరాలను కూడా సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వే అనుసంధానిస్తుంది. ఇక మహారాష్ట్ర పర్యటన సందర్భంగా మోడీ .. ముంబైలో రెండు కొత్త లైన్ల మెట్రోని ప్రారంభించారు. ఇక్కడ జరిగిన బీకేసీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇంకా పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.