ఎన్నడూ లేనిది ప్రధాని మోడీ బుధవారం పార్లమెంటులో నీలిరంగు జాకెట్ తో దర్శనమిచ్చారు. బ్లూ కలర్ అంటే ఆయనకు ఇష్టమేమో నని అంతా అనుకున్నారు కూడా.. కానీ దీనివెనుక కారణం ఒకటుంది. వాతావరణ మార్పు.. క్లైమేట్ ఛేంజ్ ఉద్యమంలో ముందున్న ఆయన నీలి రంగు జాకెట్ ధరించారంటే.. పర్యావరణ రక్షణ స్ఫూర్తిని ప్రజలోకి తీసుకువెళ్లాలన్నదేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ జాకెట్ సాధారణమైనది కాదట.. ఇది రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారైన స్పెషల్ జాకెట్ అట ! ఇదొక సందేశంలాంటిదేమరి అంటున్నారు.
క్లైమేట్ ఛేంజ్ అంటే ‘రెడ్యూస్’, ‘రీయూజ్’, ‘రీసైకిల్’ అన్న మంత్రమొకటి ఉందని మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వస్తువుల వంటివాటిని పారేయకుండా రీసైకిల్ చేసి తిరిగి వినియోగించుకోవడం అన్నది ముఖ్యమని ఆయన వివరించారు.
బెంగుళూరులో ఈ నెల 6 న జరిగిన ‘ఇండియా ఎనర్జీ వీక్’ కార్యక్రమం సందర్భంగా ఈ నీలి రంగు జాకెట్ ని ఆయనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బహుకరించింది. రీటైల్ కస్టమర్ అటెండెంట్లకు, ఎల్ఫీజీ డెలివరీ సిబ్బందికి ఈ సంస్థ ఇలా రీసైకిల్డ్ పాలిస్టర్ లేదా కాటన్ తో తయారైన జాకెట్లను ఇస్తోంది.
ఇలాంటి జాకెట్ ధరించి పార్లమెంటుకు వచ్చిన మోడీ ఫోటోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ షేర్ చేస్తూ.. మోడీ కేవలం చెప్పడమే కాదని, చేతల్లో కూడా చేసి చూపిస్తారని ట్వీట్ చేశారు. వాతావరణ పరిరక్షణ కోసం ఆయన ఎంత పరితపిస్తున్నారో తెలుస్తోందని అన్నారు. ఇది సూపర్బ్ అని అభివర్ణించారు. ఎకో-ఫ్రెండ్లీ క్లాథింగ్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. 10 కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ ని రీసైకిల్ చేసి ఈ విధమైన జాకెట్లను తయారు చేస్తోందని, వీటిని సాయుధ దళాలకు ఇవ్వనుందని మోడీ ఇటీవల చెప్పారు.