ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోడీ.. రాష్ట్రంలోని వివిధ రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.యఅయితే ఈ ఏడాది జనవరిలోనే మోడీ హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవంతో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాలతో ఆ పర్యటన వాయిదా పడింది.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ నుంచే వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు. అయితే తాజాగా సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించడానికి హైదరాబాద్‌కు రానున్నారు. ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్- తిరుపతి మధ్య పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే రైలును.. బీబీనగర్, గుంటూరు మీదుగా నడపబడే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న మొదటి వందేభారత్(సికింద్రాబాద్-విశాఖపట్నం) ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడల మీదుగా నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌ను నల్గొండ, గుంటూరు మీదుగా నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. అయితే ఇందుకోసం బీబీనగర్ – గుంటూరు సెక్షన్‌ను గరిష్టంగా 130 కి.మీ వేగంతో అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సెక్షన్‌లో రైళ్లు గరిష్టంగా 110 కి.మీ వేగంతో నడపబడుతున్నాయి.
ప్రస్తుతం సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్.. ఈ మార్గంలో తిరుపతికి నడపబడుతున్నాయి. ఈ ప్రయాణానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ప్రతిపాదిత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని తొమ్మిది గంటలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్‌కు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరులలో స్టాప్‌లు ఉండే అవకాశం ఉంది.