ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రహ్లాద్ మోడీ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కన్యాకుమారి, మధురైతో పాటుగా మరి కొన్ని ప్రాంతాల సందర్శనకు వచ్చారు. చెన్నై చేరుకున్నాక ఆయన అనారోగ్యంతో ఈ రోజు అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇటీవల ఆయన కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. కర్ణాటకలోని మైసూర్లో రోడ్డులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్ మోడీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
గతేడాది డిసెంబర్ 27న ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో కలిసి బెంజ్ కారులో బయలుదేరారు. మైసూరు నుంచి బందీపుర్ వైపు వెళ్తుండగా కడకోల సమీపంలో రోడ్డు డివైడర్ను కారు ఢీకొట్టింది. మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు.