బ్రిటన్ నూతన రాజు చార్లెస్-3కు ప్రధాని మోడీ తొలిసారి ఫోన్ చేశారు. చార్లెస్-3తో పలు అంశాలపై ప్రధాని మోడీ ఫోన్ లో సంభాషించారు. ఈ మేరకు విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ సమస్యలపై వారిద్దరు చర్చించినట్టు వెల్లడించింది.
దీంతో పాటు ఇంధన పరివర్తనకు ఆర్థిక సాయం కోసం కొత్త పరిష్కారాల అన్వేషణ విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు పీఎంవో పేర్కొంది. జీ20 సమావేశాలకు భారత్ అధ్యక్షత, మిషన్ లైఫ్ వంటి అంశాలపై కూడా వారిద్దరు మాట్లాడుకున్నట్లు వివరించింది.
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 నియమితులైన తర్వాత ప్రధాని ఆయనతో తొలిసారిగా మాట్లాడారు. ఈ సందర్భంగా చార్లెస్-3కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కామన్వెల్త్ దేశాల సంబంధాలు, వాటిని మరింత బలోపేతం చేసే విషయంలో ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
భారత్, బ్రిటన్‌ల మధ్య ఓ జీవన వారధిలాగా ద్వైపాక్షిక సంబంధాలను సుసంపన్నం చేయడంలో బ్రిటన్‌లోని భారతీయ సమాజం కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రశంసించారని పీఎంవో తెలిపింది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్-2 గతేడాది సెప్టెంబర్‌లో కన్ను మూశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు.