డిసెంబర్ 1 నుంచి జీ-20 సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించనుంది భారత్. అయితే.. మన్ కీ బాత్ లో భాగంగా ఈ సదస్సుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. ముఖ్యంగా తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడి గురించి ప్రస్తావించారు. ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సిరిసిల్లకు చెందిన చేనేత కళకారుడు హరిప్రసాద్ ఈమధ్య ప్రధాని మోడీకి ఓ గిఫ్ట్ పంపారు. జీ-20 సదస్సుకు సంబంధించిన లోగోను తన స్వహస్తాలతో నేసి పంపించారు. దాంతోపాటు మోడీకి ఓ లేఖ కూడా రాశారు హరిప్రసాద్. దీని గురించే మన్ కీ బాత్ లో ప్రస్తావించారు ప్రధాని. ఆ అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.
హరిప్రసాద్ కళ అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉందని కొనియాడారు ప్రధాని. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో ప్రస్తావించారని వివరించారు.
మన్ కీ బాత్ లో హరిప్రసాద్ గురించి మోడీ మాటల్లో..
‘‘మిత్రులారా.. నేను ఒక ప్రత్యేకమైన బహుమతిని సూచిస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన సొంత చేతులతో నేసిన జీ -20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ జీ తన కళలో ఎంతో నిష్ణాతులు. ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తారు. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు హరిప్రసాద్ జీ నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని అందులో రాశారు. దేశం సాధించిన ఈ విజయం ఆనందం మధ్య, అతను తన సొంత చేతులతో జీ-20కి సంబంధించిన లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుంచి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈరోజు పూర్తి మక్కువతో దానిలో నిమగ్నమై ఉన్నారు’’