- దక్షిణాదిపై బిజెపి ఫోకస్
- దూకుడు పెంచిన కాషాయదళం
- 10 లక్షల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణే లక్ష్యంగా, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా ఫోకస్ పెట్టిన బిజెపి దూకుడు పెంచింది. తెలంగాణలో బలపడే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా.. జులై 3న హైదరాబాద్ లోని పరేడ్‌గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించబోయే బహిరంగ సభను రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, అగ్ర నాయకులంతా ఈ సభకు హాజరవుతుండటంతో కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. సభకు 10 లక్షల మంది ప్రజలు తరలివచ్చేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది.
బిజెపి బహిరంగ సభ ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించేందుకు నియోజకవర్గ ఇంచార్జులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. ఇతర కమిటీలతోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. వీటితోపాటు ఈనెలలో నిర్వహించబోయే యోగా దివస్, జాతీయ ఎమర్జెన్సీ డే వంటి కార్యక్రమాల సందర్బంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా నేతలకు దిశానిర్దేశం చేశారు. మోడీ సభకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆహ్వానం పంపాలని నిర్ణయించారు. ఇందుకోసం 50 లక్షల ఆహ్వానపత్రికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 10 వేల మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవడం.. తమిళనాడులో పుంజుకోవడం.. కేరళలో పాగా వేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్న బిజెపి.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే దిశగా సన్నద్ధమవుతోంది. ఈ దశలో జాతీయ కార్యవర్గ సమావేశాలు కీలకం కానుండటంతో.. జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచూతూచి వ్యవహరిస్తోంది. మరోవైపు కమిటీలకు అప్పగించిన బాధ్యతలు, తదితర అంశాలపై ఆదివారం కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ నెల 22న అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభారీలంతా తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమై జనసమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇంఛార్జి అరవింద్ మీనన్ వరుస సమీక్షలు జరుపుతున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో ప్రతి పోలింగ్ బూత్ నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు విరాళాలు సేకరించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆయా విరాళాలకు సంబంధించి పార్టీ రాష్ట్ర శాఖ పేరిట ఉన్న ఖాతాకు మాత్రమే డిజిటల్ పేమెంట్లు చేయాలని స్పష్టం చేసింది.
మొత్తానికి మోడీ బహిరంగ సభతో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందనే వైఖరిని ప్రజలకు స్పష్టం చేయడంతో పాటు అధికారాన్ని అప్పగిస్తే మరింత ప్రగతి సాకారమవుతుందనే సందేశం పంపే ఆలోచనలో ముందుకెళ్తోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణకు కేటాయించిన నిధులు, ఇచ్చిన ప్రాధాన్యతను సభ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని భావిస్తోంది.