శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున క్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్‌లో పోస్టు చేసింది.‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం’’ అని మోడీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పిఎం @narendramodi
— PMO India (@PMOIndia) December 29, 2022
ఇక, వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనురిస్తుందని ఆరోపిస్తున్న టీడీపీ.. అందుకు నిరసనగా ‘ఇదేమి కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కందకూరులో రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది.
సభా వేదిక వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమిగూడటం.. సభ జరుగుతున్న సమయంలో ప్రజల్లో కొంత తోపులాటలు చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించగానే.. తొక్కిసలాట చోటుచేసుకుని కొందరు వ్యక్తులు సమీపంలోని కాలువలో పడిపోయారు. వెంటనే సభను ఆపేసిన టీడీపీ నేతలు బాధితులను ఆస్పత్రికి తరలించారు. కొంత మంది గాయాలతో మృతి చెందగా, మరికొందరు ఊపిరాడక మృతి చెందారు.