కామన్ వెల్త్ గేమ్స్-2022లో పాల్గొనబోయే క్రీడాకారులతో ప్రధాని మోడీ బుధవారం వర్చువల్ గా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడల్లో వారంతా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని కోరుకుంటున్నట్టు మోడీ తెలిపారు. పోటీల్లో ప్రత్యర్థులను ‘క్యూ పడే హో చక్కర్ మే..కోయీ నహీ హై టక్కర్ మే’ అనే సక్సెస్ మంత్రతో ఎదుర్కోవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు.
ఈ కాలం భారత క్రీడా చరిత్రలోనే అత్యంత కీలకమైందని ఆయన పేర్కొన్నారు. మీలాంటి ఆటగాళ్లలో స్ఫూర్తి అధికంగా ఉంది. ఇప్పుడు మీ అందరికి మంచి శిక్షణ అందుతోందన్నారు. దేశంలో క్రీడలకు ప్రస్తుతం అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. మీరంతా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని ఆయన అభినందించారు
సమావేశానికి హాజరైన వారిలో చాలా మంది ఇప్పటికే పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం తొలిసారిగా వెళ్తున్నారని, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల్లో మొదటిసారి పాల్గోబోతున్న65 మంది అథ్లెట్లు.. క్రీడా ప్రపంచంలో తమదైన ముద్రవేయాలని తాను కోరుకుంటునట్టు చెప్పారు.