ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం, 2015 నుండి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఈ-కోర్ట్ ప్రాజెక్ట్ కింద వర్చువల్ జస్టిస్ క్లాక్, జస్టిస్(JustIS) మొబైల్ యాప్ 2.0, డిజిటల్ కోర్ట్ మరియు S3WaaS వెబ్‌సైట్‌లు వంటి వివిధ కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రొ.ఎస్ పి. బాఘెల్, భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా మరియు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇమేజ్ పెరుగుతోందని మోడీ అభిప్రాయపడ్డారు. యావత్ ప్రపంచం దృష్టి భారత్ పైనే ఉందని మోడీ చెప్పారు. దేశం ముందు ఎన్నో కొత్త అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అన్ని అడ్డంకులు దాటుకుంటూ ముందుకు వెళుతున్నామని మోడీ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్టను పెంచడమే తన కర్తవ్యం అని మోడీ చెప్పారు.
14 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ముంబైలో టెర్రర్ అటాక్ జరిగిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు ఆర్పించారు.