పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లిన ప్రధాని శనివారం రాత్రి కోల్ కతాలోని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేలూరు మఠ్ లోనే బస చేశారు. ఆదివారం ఉదయం అక్కడ విద్యార్ధుల నుద్దేశించి ప్రసంగిస్తూ ”పౌరసత్వ చట్టం గురించి మీకేం అర్దమైంది..? ప్రతిపక్షాలు అర్దం చేసుకునే స్థితిలో లేవు..వాళ్లకున్న స్వార్ధ ప్రయోజనాలతో ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు” అని అన్నారు. పౌరసత్వ చట్టం అంటే ఇతరుల పౌరసత్వాన్ని లాక్కోవడం కాదని…పౌరసత్వం ఇవ్వడమని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ లో మైనార్టీలపై వేధింపుల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు….70 ఏళ్లుగా మైనార్టీలపై ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారో పాకిస్థాన్ సమాధానం చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే…ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, భౌగోళికత, వారి ఆహారపు అలవాట్లు మనకు గర్వకారణం..పౌరసత్వ చట్టం ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రధాన మంత్రి తెలియజేశారు. ”స్వామి వివేకానంద జయంతి సందర్బంగా మీకందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..ఇక్కడ మఠ్ అధ్యక్షుడు, ఇతర సన్యాసులు తనను గత రాత్రి ఈ మఠ్ లో పడుకోనిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు…బేలూరు మఠ్ ఓ యాత్రా స్థలి కంటే తక్కువేమి కాదు..కానీ నాకు మాత్రం ఇది ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రధాని ఆదివారం కోల్ కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రధాన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సి.ఎ.ఎ, ఎన్.ఆర్.సి, ఎన్.పి.ఆర్ అమలుపై పునరాలోచించాలని ప్రధానిని కోరారు.