హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్ లో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ గా మాట్లాడారు.
‘ ఇలాంటి విగ్రహాన్ని గత కొన్నేండ్లుగా సిమ్లాలో మనం చూస్తున్నాము. రెండో విగ్రహాన్ని మోర్బీలో నేడు ప్రారంభించాము. ఇలాంటి మరో రెండు విగ్రహాలను రామేశ్వరం, పశ్చిమబెంగాల్ లో ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
‘ దేశంలో పలు ప్రాంతాల్లో రామకథను చెబుతున్నారు. భాష, మాండలికాలు ఏవైనా కానీ రామకథ స్ఫూర్తి మనందరిని ఏకం చేస్తుంది. ఇది భారతీయ విశ్వాసానికి, ఆధ్యాత్మికత, సాంస్కృతికి ఉన్న శక్తి’ అని ఆయన పేర్కొన్నారు.
‘ హనుమంతుడు తన భక్తి, సేవ ద్వారా ప్రతి ఒక్కరినీ కలుపుతాడు. ప్రతి ఒక్కరూ హనుమాన్ జీ నుండి ప్రేరణ పొందుతారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్‌లో హనుమాన్ జీ ముఖ్యమైన భాగం’ అని ప్రధాని మోడీ వివరించారు.
హనుమాన్‌జీ చార్ ధామ్’ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు దిక్కుల్లో నిర్మిస్తున్న నాలుగు విగ్రహాల్లో ఈ విగ్రహం రెండోదని ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం తెలిపింది. మోర్బీలోని బాపు కేశవానంద్ జీ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని పశ్చిమ దిశలో ఏర్పాటు చేసినట్లు పీఎంవో వెల్లడించింది.