కరోనా మహమ్మారిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి 8 గంటలకు జాతి నుద్దేశించి మాట్లాడనున్నారు. ”ప్రాణాంతకమైన కరోనా వైరస్ కు సంబంధించి కీలక విషయాల గురించి ఈరోజు రాత్రి 8 గంటలను నేను జాతి నుద్దేశించి మాట్లాడతాను” అని ప్రధాన మంత్రి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
గత గురువారం నుంచి ప్రధాన మంత్రి జాతినుద్దేశించి మాట్లాడడం ఇది రెండోసారి. గత ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిస్తూ గురువారం మాట్లాడారు. ఆదివారం నుంచి దాదాపు దేశమంతా లాక్ డౌన్ పాటిస్తోంది. పంజాబ్ లో మాత్రం పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంపై సోమవారం మీడియా, పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో ప్రధాన మంత్రి చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ 14000 మందిని బలి తీసుకోగా…3 లక్షల మందికి పాజిటివ్ గా తేలింది.
ఇండియాలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. విమానాలు, మెట్రోలు, బస్సు సర్వీసులతో అన్ని బంద్ అయ్యాయి. అత్యవసర సేవల్లో పాల్గొనే వారు తప్ప మిగతా వారెవరిని బయటకు రానివ్వడం లేదు. అయినప్పటికీ కొందరు లాక్ డౌన్ ను పాటించకపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దయ చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి…మీ కుటుంబాలను కాపాడుకోండి అంటూ ప్రజలను కోరారు. లాక్ డౌన సరిగ్గా అమలయ్యేలా చూడాలని…ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు.