టాటా ఎయిరిండియాకు ఓ సీనియర్ అధికారి షాకిచ్చారు. ఎయిరిండియాను ప్రైవేట్ పరం చేయకముందే ఈ సంస్థ సర్వీసులు బాగుండేవని ఆయన మండిపడ్డారు. ఆయన మరెవరో సాదాసీదా అధికారి కాదు. ప్రధానమంత్రికి ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ వివేక్ దేబ్ రాయ్ . ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరవలసిన ఏ1 687 ఎయిరిండియా విమానం గంటలు గంటలు ఆలస్యం కావడంతో తాను విసుగెత్తిపోయానని ఆయన ట్వీట్ చేశారు.
ఈ విమానం సాయంత్రం 4-35 గంటలకు ఢిల్లీకి బయల్దేరవలసి ఉందని, కానీ రాత్రి 9 గంటలు కావస్తున్నా .. తగిన సమాచారం లేదని అన్నారు. ఇకపై భవిష్యత్తులో ఎప్పుడూ ఎయిరిండియా విమానం ఎక్కరాదని నిర్ణయించుకున్నానని దేబ్ రాయ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవటైజేషన్ కావడానికి ముందు కన్నా ఇది మరింత ఘోరంగా ఉందన్నారు.
ఈ సంస్థ అధికారుల్లో ఎవరికీ బాధ్యత ఉన్నట్టు కనిపించడం లేదని, కౌంటర్ లోని స్టాఫ్ అదే పనిగా సమయాలు మారుస్తూ వచ్చారని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుమారు 4 గంటలకు పైగా ఆలస్యం కావడమంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు. అయితే ఈ ట్వీట్ కు ఎయిరిండియా స్పందిస్తూ.. నిర్వహణా కారణాల వల్ల విమానం ఆలస్యమవుతోందని, రాత్రి 10 గంటలకు బయల్దేరుతుందని, ప్రయాణికులందరికీ తమ సిబ్బంది సహకరిస్తారని తెలిపింది.
కానీ వాళ్ళెవరూ సహకరించలేదని దేబ్ రాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో రెచ్చిపోతున్న ప్రయాణికుల వీడియో ట్వీట్ ని మీకు పంపమంటారా అని ప్రశ్నించారు. ముంబై-ఢిల్లీ ఏ 1 687 విమానాన్ని ఓ ‘నరకం’ గా దేబ్ రాయ్ అభివర్ణించారు.