2014కు ముందు కాంగ్రెస్ పాలనలో దేశం కుంభకోణాల్లో చిక్కుకుందని, బందుప్రీతితో దేశం నష్టపోయిందని ప్రధాని మోడీ అన్నారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంను ఆయన సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… ఈ రోజుతో మన ప్రభుత్వం ఎనిమిదేండ్లు పూర్తి చేసుకుంటోందన్నారు. 2014కు ముందు దేశం కుంభకోణాల్లో చిక్కుకుదని తెలిపారు. దేశం ఇప్పుడిప్పుడే అవినీతి, వేల కోట్ల కుంభకోణాలు, బంధుప్రీతి, ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్షల నుంచి బయటపడుతోందన్నారు.
ఈ ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశం ఉన్నత స్థానాలకు చేరుకుందన్నారు. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై భారత శక్తి గణనీయంగా పెరిగిందన్నారు. ఈ విషయాన్ని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు.
కొవిడ్ సంక్షోభం లాంటి నెగెటివ్ వాతావరణం ఉన్న సమయంలో భారత్ తన శక్తిపై విశ్వాసం ఉంచిందన్నారు. ముఖ్యంగా మన శాస్త్రవేత్తలు, వైద్యులు, యువతపై నమ్మకం ఉంచింది. సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచ దేశాలకు ఒక ఆశాకిరణంలా భారత్ కనిపించిందన్నారు.