-ఈ ఎన్నికలు అదే విషయాన్ని నిరూపించాయి
-ఫలితాలు ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబించాయి
– మా విజయాల వెనుక త్రివేణి శక్తి ఉంది
-ఈ ప్రాంతంపై గత ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి
-కొందరు మర్ జా మోడీ, దేశం మత్ జా మోడీ అంటోంది
ఈశాన్య ప్రాంతం ఢిల్లీ నుంచి, తమ దిల్(హృదయం) నుంచి దూరంగా లేవని మూడు రాష్ట్రాల ఎన్నికలు నిరూపించాయని ప్రధాని మోడీ అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని దేశానికి, ప్రపంచానికి ఈ ఎన్నికలు చూపించాయని ఆయన అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీకి చెందిన కొంతమంది ‘ప్రత్యేక శ్రేయోభిలాషులు’ పార్టీ నిరంతర విజయాలతో కలవరపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మా విజయాల వెనుక త్రివేణి శక్తి…
పార్టీ ఇన్ని ఎన్నికల్లో ఎలా గెలుస్తోందనే విషయంపై తెగ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. తమ విజయాల వెనక ఉన్న రహస్యాన్ని ఈ రోజుకు వారికి చెప్పాలనుకుంటున్నానన్నారు. తమ విజయాల వెనుకు త్రివేణి శక్తి ఉందని ఆయన వివరించారు.
అవి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది, తమ ప్రభుత్వాల వర్క్ కల్చర్, తమ పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ అన్నారు. ఆ త్రివేణి శక్తి వల్ల తమ పార్టీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తోందన్నారు. మూడు రాష్ట్రాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ, తమ మిత్ర పక్షాలను గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈశాన్యంపై గత ప్రభుత్వాల శీతకన్ను
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఈశాన్య రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో ఇంకా విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం అంతా సులువైన పని కాదని గత ప్రభుత్వాలకు తెలుసన్నారు. అందుకే ఆ ప్రాంతాలపై శీతకన్ను వేశాయన్నారు.
మర్ జా మోడీ… మత్ జా మోడీ
కొన్నేండ్లుగా మైనార్టీలు బీజేపీ పట్ల భయాందోళనకు గురయ్యారని చెప్పారు. కానీ గోవా, ఇప్పుడు ఈశాన్య ప్రజలు ఈ ప్రచారాన్ని బహిర్గతం చేశారని తెలిపారు. కొంతమంది ‘మర్ జా మోడీ'(మోడీ చావాలని) అంటున్నారని, దేశం మాత్రం ‘మత్ జా (వెళ్లొద్దు) మోడీ’ అని అంటోందన్నారు.