‘ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ’ ప్రధానమంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మీడియాలో వచ్చిన కథనాలకు పీఎంవో మంత్రి జితేంద్రసింగ్ స్పందించారు.
మోదీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా చూడాలని ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్లు తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయని.. ఇది పూర్తిగా అబద్ధమని జితేంద్రసింగ్ ట్వీట్ చేశారు.
పీఎంవో అలాంటి సందేశం ఏదీ పంపలేదని ట్వీట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు.. ఆయన కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని ఆశించామని.. ఆరోగ్యం బాగాలేనందున ఆయన హాజరుకాలేకపోతున్నట్లు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించిందని జితేంద్రసింగ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా స్పందించారు. అనారోగ్యం వల్ల ప్రధాని కార్యక్రమానికి వెళ్లడంలేదని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటన చేశారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ఓ ఆంగ్ల ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు భిన్నంగా మాట్లాడారని అన్నారు. మోడీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు సంజయ్.