ఓవైపు దళిత బంధు అంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. ఇన్నేళ్ల నుంచి ఎవరూ పట్టించుకోలేదు.. దళితుల్ని తామే ఆదుకుంటున్నామంటూ కలరింగ్ ఇస్తోంది. కానీ.. ఇంకోవైపు వారి భూములను లాగేసుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో దళితులకు భూములు కేటాయించారు. అయితే టీఆర్ఎస్ సర్కార్ మాత్రం వాటిని మళ్లీ లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది.
1961లో పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడలోని 3/1 ప్రభుత్వ సర్వేనెంబర్ లోని భూమిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున ఇచ్చింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను లాగేసుకుంటోందని దళిత నాయకుడు శివకుమార్ ఆరోపించారు. దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తున్న కేసీఆర్ కు.. తాము దళితులలా కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
పోచారం మున్సిపల్ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారని బాధితులు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లను సైతం చూపించారు. వెంటనే తమ భూములను లాక్కోవడం ఆపేయాలని డిమాండ్ చేశారు దళితులు.