మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోశగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల విషయంలో గిరిజనులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికంగా ఏర్పాటు చేసిన గుడిసెలను పోలీసులు తొలగించడంతో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. గుడిసెలు తొలగింపును అడ్డుకునేందుకు ఆదివాసీ మహిళలు తీవ్రంగా ప్రయత్నించారు.
అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న కారణంగా వాటిని తొలగించేందుకు చూశారు పోలీసులు, అటవీ శాఖ అధికారులు. ఆ భూమిలో ఉన్న మూడు గుడిసెల కోసం దాదాపు మూడు వందల మంది అటవీ, పోలీసు సిబ్బంది ఆ గూడెంను చుట్టుముట్టారు. అయితే.. ఆదివాసీ మహిళలు తీవ్రంగా ప్రతిఘటించడంతో చేసేదేం లేక కొన్ని గుడిసెలను నేలమట్టం చేశారు.
అటవీ భూముల్లో నుంచి ఆదివాసీలను ఎలాగైనా పంపించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున బలగాలను మొహరించారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఒక్కవైపు వర్షం పడుతున్నా కొందరు మహిళలు అధికారులను అడ్డుకున్నారు. కారంపొడి చల్లి కాసేపు నిలువరించారు. కానీ.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వానలు బాగా పడుతుండడంతో గిరిజనులు పోడు సాగుకు పూనుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇది జరుగుతోంది. అయితే.. పోలీసులు, అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.