జనగామ ప్రభుత్వాసుపత్రి దగ్గర విషవాయువు కలకలం రేపింది. ఉన్నట్టుండి ఒక రకమైన విష వాయువు వ్యాపించడంతో ఆసుపత్రిలోని రోగులతో పాటు సహాయకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అటు,హాస్పిటల్ చుట్టుపక్కల ఉండే స్థానికులు కూడా తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
విష వాయువు ప్రభావానికి గురైన వారంతా, విపరీతమైన దగ్గుతో పాటు విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
మరోవైపు..ఈ ఘటనతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది తక్షణ సహాయక చర్యలకు దిగారు. స్థానికులు ఇతర ఆసుపత్రులకు పరుగులు తీశారు. ఇదంతా జరిగింది రాత్రి పూట కావడంతో, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఇక విషవాయువుతో కనీసం 30 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఈఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మిషన్ భగీరథకు చెందిన క్లోరిన్ లీకేజీయే ఈ ప్రమాదానికి కారణం అని అనుమానిస్తున్నారు. ఈ వాసన అదేనని స్థానికులు చెబుతున్నారు.